తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరాశ లేదు.. నిశ్చింతా లేదు.. కానీ కాంగ్రెస్​, ఆప్​ను తట్టుకొని నిలబడతారా?

Gujarat Election : గుజరాత్‌ అంటే భారతీయ జనతాపార్టీ ప్రయోగశాలగా పేరు! ఎన్నిక ఏదైనా విజయం భాజపాదే అనే ధీమా! ఆ పార్టీలోనే కాదు.. విపక్షాల్లోనూ అదే భావన! 27 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి! మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలనాథులే కచ్చితంగా విజయం సాధిస్తారా? కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీలను తట్టుకొని నిలబడతారా?

BJP situation in gujarat elections
BJP situation in gujarat elections

By

Published : Nov 12, 2022, 6:50 AM IST

Updated : Nov 12, 2022, 7:08 AM IST

Gujarat Election : సమకాలీన రాజకీయాల్లో గుజరాత్‌ భాజపా కంచుకోటే కాదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రం కూడా! అందుకే.. అక్కడి ఎన్నికలేవైనా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. మోదీ దిల్లీకి వచ్చినా.. రాష్ట్రంలో ఆయన ప్రభావమే ఇంకా బలంగా నడుస్తోంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మోదీని చూసే గుజరాతీలు ఓటు వేస్తూ వస్తున్నారు. ఫలితంగా ఆయన అక్కడ లేకున్నా గుజరాత్‌లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ ఉంటున్నా విజయంపై మాత్రం కమలనాథులు నిశ్చింతగా ఉంటూ వస్తున్నారు.

అలాంటి పూర్తి ధీమా ఈసారి భాజపాలోనే వ్యక్తం కాకపోవటం గమనార్హం! ఫలితంపై నిరాశ లేకున్నా.. గతంలో మాదిరి నిశ్చింత ఆ పార్టీలో ఈసారి కనిపించటం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి- కాంగ్రెస్‌కు తోడు కేజ్రీవాల్‌ పార్టీ ఆమ్‌ఆద్మీ రంగంలోకి దిగటం! రెండు- కరోనా అనంతర ఆర్థిక, సామాజిక పరిస్థితులు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రశ్న పత్రాల లీకేజీలు, ప్రభుత్వంపై వ్యతిరేకతలకు కేజ్రీవాల్‌ హామీలు తోడవటంతో ఈసారి పరిస్థితులు గతంలో మాదిరిగా నల్లేరుపై నడకలా లేవనే సంగతిని భాజపా అధిష్ఠానం గుర్తించింది. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా దిద్దుబాటు చర్యలను మొదలెట్టింది. ప్రజల్లో వ్యతిరేకత ఎన్నికల్లో ప్రభావం చూపించకుండా ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

కరోనా కాలంలో రాష్ట్రంలోని భాజపా సర్కారు పనితీరు సామాన్యుల్లో అసంతృప్తిని పెంచింది. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికిపైగా మరణించారు. తొలుత 10 వేల మందే మరణించినట్లు చెప్పినా.. లక్ష మందికిపైగా పరిహారం చెల్లించామంటూ కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇవన్నీ గుర్తించిన నరేంద్రమోదీ, అమిత్‌షాలు వెంటనే.. ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని సహా.. కేబినెట్‌ అందరినీ తీసేసి.. కొత్త మంత్రివర్గాన్ని పీఠంపై కూర్చోబెట్టారు. కొత్త ముఖాలతో సర్కారుకు కొత్త రూపునిచ్చారు. తద్వారా వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోకుండా జాగ్రత్త పడ్డారు. దిద్దుబాట అక్కడితో ఆగలేదు.

రాష్ట్రంలోకి కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ రాకను గమనించిన భాజపా.. గత 8నెలలుగా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా చూస్తూ ప్రతి లోపాన్ని పూడ్చుకుంటూ వెళుతోంది. ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా.. పూర్తిగా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను, మాజీ ముఖ్యమంత్రి రూపాని సహా 8 మంది మంత్రులను ఎన్నికలకు దూరంగా ఉంచటం కూడా ఈ కఠిన నిర్ణయాల్లో భాగమే. 13 మంది కాంగ్రెస్‌ మాజీ అభ్యర్థులకు ఈసారి భాజపా సీట్లివ్వటం గమనార్హం. ఓటర్లు ముఖ్యంగా నిరుద్యోగులు ఆప్‌ వలలో పడకుండా.. ఉండటానికి ఎన్నికలకు ముందు రెండు భారీ ప్రాజెక్టులను గుజరాత్‌కు తీసుకొచ్చారు. 1.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు (వేదాంత ఫోక్స్‌కాన్‌, టాటా ఎయిర్‌బస్‌) మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు వచ్చాయి. దీనిపై మహారాష్ట్రలో వ్యతిరేకత వ్యక్తమైనా.. ధైర్యంగా గుజరాత్‌కు తేవటంలో భాజపా అధిష్ఠానం సఫలమైంది.

ఇవీ సవాళ్లు..

  • కరోనా తదనంతర పరిస్థితులు
  • పెరిగిన ధరలు
  • ఆమ్‌ ఆద్మీపార్టీ రాక..
  • ఊరిస్తున్న కేజ్రీవాల్‌ తాయిలాలు..
  • చాపకింద నీరులా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచారం.. వీటన్నింటికి మించి రాష్ట్రంలో 27 సంవత్సరాల సుదీర్ఘ పాలనపై మొహంమొత్తే అవకాశం.. ఇవన్నీ.. భాజపాకు సవాళ్లే!

కాంగ్రెస్‌పై కన్నేసి..
కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకున్నా ఆపార్టీని భాజపా తక్కువగా అంచనా వేయటం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీనిచ్చింది. 77 సీట్లతో కాంగ్రెస్‌ దాదాపు దగ్గరగా వచ్చేసింది. మెట్రో ప్రాంతాల్లో భాజపా 80శాతం సీట్లు గెల్చుకున్నా.. మిగిలిన 127 సీట్లలో 70 కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. భాజపా 55 సీట్లతో వెనకబడింది. ముఖ్యంగా నార్త్‌ గుజరాత్‌, సెంట్రల్‌ గుజరాత్‌, ఆదివాసీ ప్రాంతాలు, తీరప్రాంతం..! ఈసారి కూడా ఈ ప్రాంతాలపై కాంగ్రెస్‌ చాపకిందనీరులా సాగిపోతోంది. వారి ఓటు బ్యాంకును నిలబెట్టుకోవటంపై గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే "కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. వాళ్లు నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నారు. అది మనకు పెద్ద సవాలు" అని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పార్టీ నేతలను హెచ్చరించారు. మొత్తానికి మోదీ స్వరాష్ట్రమని.. ఈసారి భాజపా నిశ్చితంగా ఉండలేని పరిస్థితి!

ఇవీ చదవండి :గుజరాత్‌ ఎన్నికలు.. కాంగ్రెస్‌, NCP మధ్య కుదిరిన పొత్తు.. 3స్థానాల కోసమే..

హిమాచల్​ ప్రదేశ్​లో పోలింగ్​కు రంగం సిద్ధం

Last Updated : Nov 12, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details