ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండుగను యువతీయువకులు ఘనంగా జరుపుకొంటారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన వాలంటైన్ వీక్ వ్యాపారులకు బానే కలిసొచ్చింది. కొందరైతే తమ ఇష్టసఖులకు ప్రేమగా కానుకలిచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనకాడట్లేదు. ఇన్నీ చేస్తున్నారు సరే... కానీ అసలీ ప్రేమికుల రోజు వెనకున్న చరిత్ర తెలుసా?
ఎవరీ వాలంటైన్?
ప్రేమికుల దినోత్సవం చరిత్రపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మూడో శతాబ్దంలో రెండో క్లాడియస్ పాలించిన రోమ్ నగరంలో సెయింట్ వాలంటైన్ ఓ క్రైస్తవ ప్రవక్తగా ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరనే భావనతో చక్రవర్తి.. తన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు. ఇది నచ్చని వాలంటైన్... పురుషులకు రహస్యంగా పెళ్లి చేసేవారు.
ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్.. వాలంటైన్కు మరణశిక్ష విధించారు. అయితే శిక్ష కాలంలో జైలర్ కుమార్తెను వాలంటైన్ ప్రేమిస్తాడు. ఫిబ్రవరి 14న తాను చనిపోయే ముందే.. వాలంటైన్ తన ప్రియురాలికి ప్రేమ లేఖ పంపించాడు.