సూఫీలు, సాధువులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా పేరుగాంచింది కశ్మీర్. శాంతి, సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలన్న వారి సూచనలను అక్షరాలా పాటించి చూపిస్తోంది. ఇక్కడి ప్రజలు పాటిస్తున్న ఏళ్లనాటి ఓ సంప్రదాయాన్ని.. శ్రీనగర్‌లోని కొహి మరాన్లో హజ్రత్ మఖ్దూమ్ సాహబ్‌కు కొద్ది దూరంలోనే ఉన్న ఆలయం, మసీదు కళ్లకు కడుతున్నాయి. మసీదు నుంచి అజాన్, గుడి గంటలు, గురుద్వారా నుంచి కీర్తనలు ఒకేసారి వినిపిస్తాయిక్కడ. వివిధ మతాలవారు కలిసిమెలిసి, ప్రశాంతంగా సాగిస్తున్న జీవనానికి కొహి మరాన్ చక్కటి ఉదాహరణ. మఖ్దూమ్ సాహెబ్ దర్గా దర్శనానికి అన్ని మతాల వారూ క్యూ కడతారు.
"అన్ని వయసుల వారు, అన్ని ప్రాంతాల వాళ్లూ ఏడాది పొడగునా ఇక్కడికి వస్తుంటారు. వివిధ వర్గాల మధ్య ఎలాంటి తారతమ్యం, శత్రుత్వం ఉండవు. గుడికి వచ్చే భక్తులైనా, గురుద్వారాకు వచ్చే భక్తులైనా దర్గాలో ప్రార్థనలు చేసి వెళ్లిపోతారు. మా ముత్తాతలు పాటించిన విధానాల్నే ఇప్పటికీ పాటిస్తున్నామనేందుకు ఇదే తార్కాణం."
- షబీర్ అహ్మద్ మఖ్దూమీ, ఇమామ్
గుడి బాధ్యతలు ముస్లిం వ్యక్తివే..
గుడి తలుపులు ఓ ముస్లిం వ్యక్తి తెరవడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా ఆలయ బాధ్యతలు ఆ ముస్లిం వ్యక్తే చూసుకుంటున్నాడు. గుడికి ఏ మతం వారు వచ్చినా సాదరంగా లోపలికి ఆహ్వానించే ముసల్మాన్ని చూస్తే.. ఇక్కడి అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
"తాళంచెవి మా వద్దే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు, వాళ్లకోసం తలుపులు తెరుస్తాం. మా వర్గాల మధ్య ఈ బంధం ఏళ్ల నాటిది. పండితులు, సిక్కులతో కలిసే పెరిగాం. అందుకే సహజంగానే ప్రశాంతంగా బతుకుతాం."