మహారాష్ట్రలోని అమరావతిలో నున్నటి ఉపరితలంతో పక్కా కొలతలతో గోళాకారంలో ఉండే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూస్తే భలే ఉన్నాయే అనిపించక మానదు. మేల్ఘాట్లోని మల్కాపూర్గోండ్ గ్రామంలోని ఓ కాలువ వద్ద ఈ గుండ్రటి రాళ్లు విరివిగా కనిపిస్తాయి. ఈ కాలువలో మాత్రమే ఇవి దొరుకుతాయి. గుండ్రటి రాళ్ల పేరు మీదుగానే ఈ కాలువకు గోల్యాదేవ్ అని పేరుపెట్టారు స్థానికులు. గోల్యాదేవ్ను గ్రామస్థులు పూజిస్తారు కూడా. గ్రామంలో 4 గోల్యాదేవ్లు ఉండగా... కొండపైన ఆలయం కూడా నిర్మితమైంది.
"మేం గోల్యాదేవ్ను పూజిస్తాం. కొండల దగ్గర గుండ్రటి రాళ్లు దొరుకుతాయి."
- అశోక్ మహల్లే, స్థానికుడు
ఇదీ చదవండి:ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!
300 కిలోలకుపైగా..
1990లలో అటవీ శాఖ ఇక్కడ దాదాపు 80 గుండ్రటి రాళ్లను వెలికితీసింది. కొన్ని రాళ్ల బరువు 300 కిలోలకుపైగా ఉంటుంది. అప్పటి అటవీ అధికారి విజయ్ భోస్లే ఈ రాళ్ల వెలికితీత పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఈ రాళ్లు ఏర్పడటానికి రసాయన, యాంత్రిక కారణాలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
"ఈ గోళాకారపు, నున్నటి రాళ్లను మనుషులు తయారు చేయలేరు. వీటిని గ్రహాంతరవాసులు తయారుచేసి ఉంటాయని వదంతులు వినిపిస్తాయి. ఇక్కడున్న కొన్ని రాళ్లను భూమిని తవ్వి వెలికితీశారు. మరి కొన్నింటినైతే గ్రామంలో గోల్యాదేవాగా పూజిస్తారు. ఇంకొన్ని రాళ్లు అలా ఊరికే పడున్నాయి. ఈ రాళ్లు పిరంగుల కోసమైతే కచ్చితంగా చేసి ఉండరు. మరి ఎందుకు తయారైనట్లు? పురాతన కాలంలో మనుషులే వీటిని ఎందుకు తయారుచేసినట్లు? ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు."