తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారి జీవితమంతా కన్నీటి వెతలే, కష్టాల కథలే! - Tamil Tea Estate workers in Bonakkad

కేరళలోని బొనాకాడ్​.. చారిత్రక స్థలంగా యునెస్కో గుర్తింపు పొందింది. భూలోక స్వర్గంగా పర్యటకులను అలరిస్తోన్న ఈ ప్రాంతం.. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. అయితే.. ఇక్కడి టీ ఎస్టేట్​లలో పనిచేసే కార్మికుల జీవితాలు.. హృదయాల్ని కలిచివేస్తున్నాయి. ఉపాధి కోసం వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. పనిచేసినా వేతనాలు అందక పాడుబడ్డ గుడిసెల్లో నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారి దీనగాథను ఓ సారి పరిశీలిస్తే..

SPECIAL STORY ABOUT BONAKKAD PEOPLES WHO LOST THEIR JOBS IN TEA ESTATE WORK
బ్రిటిషర్ల చేతల్లో నలిగి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు

By

Published : Nov 29, 2020, 8:30 AM IST

బొనాకాడ్​ ప్రజల జీవిత గాథ

బొనాకాడ్... కేరళలోని అగస్త్య పర్వతశ్రేణిలోని ఓ లోయ ఇది. చారిత్రక స్థలంగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం.. భూలోక స్వర్గంగా పర్యటకులను అలరిస్తోంది. పర్వతశ్రేణిలోని అగస్త్య శిఖరం అడుగున, సముద్రమట్టానికి 1868 మీటర్ల ఎత్తులో ఉంటుంది బొనాకాడ్. ఇక్కడి ప్రకృతి అందాలు, పర్వత సోయగాలు పర్యటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.

లయమ్స్​

ఇక్కడి టీ ఎస్టేట్లలో పనిచేసే కార్మికుల జీవితాల్లోని వెతలు కంటతడి పెట్టిస్తాయి. భారతదేశంలో పాగా వేసిన తర్వాత టీ తోటల పెంపకానికి అనువుగా ఉండే పర్వత ప్రాంతాల కోసం వెదుకులాట ప్రారంభించిన బ్రిటిషర్లు.. 1850లో తమిళనాడు నుంచి కూలీలను రప్పించుకున్నారు. వాళ్ల వసతి కోసం సింగిల్ రూమ్​లతో సముదాయాలు నిర్మించారు. వాటిని స్థానికంగా లయమ్స్ అంటారు. కొన్ని తరాలుగా తేయాకు తెంపుతూ జీవనం సాగించిన కూలీ కుటుంబాలు.. బొనాకాడ్ గ్రామంలోనే స్థిరపడిపోయారు.

పూట గడవని స్థితికి చేరిన కుటుంబాలు

బ్రిటిషర్లు టీ ఎస్టేట్లను విడిచి వెళ్లాక, వాటి యాజమాన్యాలు చాలాసార్లు మారాయి. 2001లో మహావీర్ ప్లాంటేషన్స్ ఎస్టేట్ బాధ్యతలు చేపట్టాక, కూలీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 300కు పైగా కూలీ కుటుంబాలు ఉపాధి కోల్పోయి, పూటగడవని స్థితికి చేరుకున్నాయి. వారికి వారుగా తేయాకులు తెంచే పని చేసుకుందామన్నా, ఎస్టేట్ యాజమాన్యం అందుకు ఒప్పుకోదు. కూలీలకు రావల్సిన భవిష్యనిధి వాటాను కూడా యాజమాన్యం చెల్లించలేదు.

"లయమ్స్ అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియదు. యాజమాన్యం స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లయమ్స్​ను బాగుచేసి, సరిగ్గా నిర్వహిస్తేనే.. ఆ పాత భవనాల్లో నివాసం ఉండగలం."

- తంకమణి, కూలీ

ఏ క్షణాన కూలిపోతాయో తెలియని పాడుబడిన లయమ్స్​లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి ఎన్నో కూలీ కుటుంబాలు. ప్రభుత్వాలు కూడా లబ్ధి మేరకు వాడుకుని, తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

"కంపెనీ చాలా బకాయిలు చెల్లించాలి. మాకు రావల్సిన డబ్బులు ఇప్పించాలంటూ కోర్టును కూడా ఆశ్రయించాం. గత ప్రభుత్వంతో, ప్రస్తుత సర్కారుతోనూ మా సమస్యల గురించి చర్చించాం. అయినప్పటికీ ఏ లాభమూ జరగలేదు."

- అరవిందన్, ఎస్టేట్ మాజీ ఉద్యోగి

39 ఏళ్ల నుంచి ఎస్టేట్లోనే పనిచేస్తున్న పుష్పతాయి.. తన బాధ చెప్పుకొచ్చింది. ఆమెకు ఇంకా 36 నెలల వేతనం అందాల్సి ఉంది.

"ఎస్టేట్లో పనికి కుదిరి 39 ఏళ్లు గడుస్తోంది. గత 36 నెలల జీతం ఇంకా నాకు రానే లేదు. మేం పడిన శ్రమకు ప్రతిఫలం దక్కాలి. చట్టపరంగా మాకు అనుకూలంగానే తీర్పు రావాలని దేవుణ్ని కోరుకుంటున్నాను. మా జీవితం దారుణంగా తయారయింది. నా పిల్లలు నన్ను పట్టించుకోరు. లయమ్స్ అన్నీ వర్షం పడితే జలమయమవుతాయి. నాకు రావల్సింది రాగానే ఈ ప్రాంతం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోతా."

- పుష్పతాయి, ఎస్టేట్ కూలీ

58 ఏళ్ల వయసుదాకా టీ ఎస్టేట్లోనే పనిచేసిన అరవిందన్.. ప్రస్తుతం బతుకు దెరువు కోసం గొర్రెల కాపరిగా మారాడు.

"ఇక్కడ నివసిస్తున్న నాలాంటి కూలీలందరి పరిస్థితీ దయనీయంగా ఉంది. మన్రేగా పథకం వల్లే ఈమాత్రం బతకగలుగుతున్నాం."

- అరవిందన్, ఎస్టేట్ మాజీ ఉద్యోగి

ఒప్పంద ప్రాతిపదికన ఎస్టేట్లో పనిచేశాడు రాజు. తన ఆశలన్నీ మన్నుం వీడుమ్ పథకం కింద విధుర గ్రామ పంచాయతీలో చేసుకున్న దరఖాస్తు మీదే పెట్టుకున్నానని చెప్తున్నాడు.

"ఉపాధి హామీ పథకం వల్లే బతకగలుగుతున్నాం. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఒంటరిగా ఇక్కడ వదిలేసి, పనికోసం వేరేచోటికి వెళ్లలేని పరిస్థితి నాది."

- రాజు, ఒప్పంద కూలీ

బకాయిలు వచ్చేదాకా..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలామంది ఎస్టేట్ కూలీలు చేరారు. అదొక్కటే ప్రస్తుతం వారికున్న ఆదాయమార్గం. ఎస్టేట్ నుంచి రావల్సిన బకాయిలు వస్తే, ఇతర చోట్లకు వెళ్లిపోవచ్చని ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో'

ABOUT THE AUTHOR

...view details