కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్కుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ శరీరంలోకి వైరస్ ప్రవేశించకుండా నిలువరిస్తాయి. కానీ, బంగాల్ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఓ బాలిక సరికొత్త మాస్క్‌ను ఆవిష్కరించింది. అంతే కాదండోయ్ గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ మ్యూజియంలో చోటు సంపాదించింది. ఆ మాస్క్ ప్రత్యేకత ఏమిటి? తెలుసుకుందాం.
జిల్లాలోని మెమరి గ్రామానికి చెందిన దిగంతిక బోస్ అనే 12వ తరగతి బాలిక ఓ ప్రత్యేక మాస్క్‌ను ఆవిష్కరించింది. ఈ మాస్క్ సమీపంలోకి ఎలాంటి వైరస్ వచ్చినా దానిని అంతం చేస్తుంది. అందుకే దీనికి 'వైరస్‌ను అంతం చేసే మాస్క్- 2020'గా నామకరణం చేశారు.
అంతర్జాతీయంగా హై రిజొల్యూషన్ చిత్రాలు, వీడియోలను ప్రదర్శించే గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మ్యూజియంలో చోటు సంపాదించారు దిగంతిక. గ్లోబల్‌గా అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా ఈ మాస్క్‌ను తన ఆన్లైన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచింది గూగుల్. 2011 నుంచి ఈ ఆన్లైన్ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది.