తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో ఒదిగిపోయి ఉన్న కోయంబత్తూర్.. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పర్యటక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడకు సందర్శకులతో పాటు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడి అడవులు, నదీ పరీవాహక ప్రాంతంలో అధిక సంఖ్యలో పక్షులు ఉన్నాయి.
అటవీ సిబ్బంది చొరవ..
ఈ ప్రాంతంలోని పక్షులకు మానవ కార్యకలాపాలతో ముప్పు కలుగుతోంది. వాడి పడేసిన వస్తువుల కోసం ఎగురుకుంటూ వచ్చే పక్షులు గాయాలపాలవుతున్నాయి. అంతేగాక ఇక్కడి విద్యుత్ తీగలు, వేటగాళ్ల వలలకు చిక్కి మరికొన్ని పక్షులు గాయల బారిన పడుతున్నాయి. ఇటువంటి వాటిని సకాలంలో గుర్తించి రక్షించకపోవడం వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. గాయపడిన పక్షులకు చికిత్సా కేంద్రం ఉంటే చాలా వరకు బతుకుతాయని గ్రహించిన కోయంబత్తూరు డివిజనల్ అటవీ కార్యాలయ సిబ్బంది ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆరేళ్ల క్రితం ఇక్కడ 'పక్షుల పునరావాస కేంద్రాన్ని' ప్రారంభించారు. గాయపడిన పక్షులను రక్షించడం, చికిత్స చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
ఇక్కడ కేవలం మనుషుల చేతిలోనే గాక.. తోడేళ్లు, ఇతర జంతువుల దాడిలో గాయపడిన పక్షులను ఈ కేంద్రానికి తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు. వారానికోసారి వైద్యుడు వచ్చి గాయపడిన పక్షులను పరిశీలిస్తారు. అవి పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి అడవిలో వదిలేస్తారు.
ఈ మధ్యే సూళ్లూరు ప్రాంతంలో గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుదైన ఈజిప్ట్ మాంసాహార డేగను (carnivorous eagle) ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 'రెక్కకు అయిన గాయం కారణంగా ఎగరలేకపోయిన ఆ డేగకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు' వివరించారు.