రుతుస్రావం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆలోచిస్తారు! అలాంటిది మరో జన్మను ప్రసాదించడానికి దోహదపడే ఈ ప్రక్రియను గౌరవించి, మహిళల గొప్పతనాన్ని గౌరవించడానికి ఓ పండుగ ఉందని తెలుసా? అదే రజా పర్బా. దీనికి మిథున సంక్రాంతి అనే పేరూ ఉంది. ఒడిశాలో నిర్వహించే ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. బుధవారమే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజులు.. మహిళలను, ప్రకృతిని పూజిస్తారు.
అసలు ఎందుకు చేస్తున్నారు?:వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత.. భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) నమ్ముతారు అక్కడి ప్రజలు. దీంతో నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారని ఒడిశా పర్యటక అభివృద్ధి సంస్థ(ఓటీడీసీ) ఛైర్పర్సన్ ఎస్ మిశ్రా తెలిపారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఒడిశా వాసులు.
ఈ పండగ ఒడిశాలోని వ్యవసాయ పనులు ప్రారంభానికి సూచనగా చెప్పొచ్చు. జూన్ మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి.. తొలకరి జల్లులు కురుస్తాయి. దీంతో అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. పంటలు వేయడానికి సిద్ధమవుతుంది.
'పితా ఆన్ వీల్స్' కార్యక్రమం:మామూలు పండగలా.. పిండి వంటలు తయారు చేస్తారు. వివిధ కేకులతో (పితాస్) ఈ పండగ జరుపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం 'పితా ఆన్ వీల్స్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓటీడీసీ. ఈ వాహనంపై పొదా పితా, మండా, కకరా, అరిశా, ఛకులీ, చంద్రకళ వంటి పిండి వంటలు, కేకులను భువనేశ్వర్, కటక్, సంబల్పుర్ ప్రాంతాల్లో విక్రయిస్తారని మిశ్రా తెలిపారు.
మూడు రోజులు ఇంటి పనుల నుంచి విముక్తి..:అలాగే ఆ మూడు రోజుల పాటు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. కొత్త చీరలు కట్టుకుని అందంగా ముస్తాబై ఆట పాటలతో కోలాహలంగా గడుపుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా తక్కువ మందితో ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.