'అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు'లో 38మందికి మరణశిక్ష - death sentence to 38 in Ahmedabad bomb blast case

11:42 February 18
'అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు'లో 38మందికి మరణశిక్ష
2008 ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు 38 మందికి మరణ శిక్ష విధించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణ శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. పేలుళ్ల కేసుకు సంబంధించి మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ప్రత్యేక కోర్టులో ఈ నెల 11 వ తేదీన దోషులకు శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు ప్రారంభం కాగా 15వ తేదీన ముగిశాయి. నేడు న్యాయస్థానం దోషులకు శిక్షలను ఖరారు చేసింది. 2008లో అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మొత్తం 56 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు.
అహ్మదాబాద్ వరుస పేలుళ్లపై దర్యాప్తు జరిపిన గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇందులో చాలా మందికి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన ఈ విచారణలో 1,100 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు 49 మందిని దోషులుగా తేల్చింది.