Special Arrangements for Tirumala Garuda Vahana Seva: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష, చిన్న శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలపై మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. ఇవాళ ఉదయం మోహిని అవతారాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించనున్నారు. రాత్రికి అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు.
తిరుమలకు చేరుకున్న గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు, బొమ్మ చిలుకలు: ఆనవాయితీగా గరుడవాహన సేవకు అలంకరించేందుకు తమిళనాడు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి అమ్మవారు పంపిన పూలమాలలు, బొమ్మ చిలుకలు తిరుమలకు చేరుకున్నాయి. గరుడసేవ వాహనసేవకు అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ ఆధ్వార్యంలో చెన్నై నుంచి తిరుమలకు చేరుకున్న తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
TTD Brahmotsavams 2023 : కల్పవృక్షంపై భక్తులకు దర్శమిస్తున్న మలయప్ప స్వామి
కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం: శ్రీవారి ఆలయ మాడ వీధుల గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం ఉండటంతో ఈ సారి వాహన సేవను వీక్షించేందుకు కొత్త విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తుల కోసం సుపథం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసింది.
గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా నెమ్మదిగా ముందుకు కదిలేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించనున్నారు. మాఢవీధుల్లోని గ్యాలరీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.