అంతరిక్షంలోకి చీమలను పంపించింది నాసా. స్పేస్ఎక్స్ సంస్థ.. వీటిని(spacex launch) తన వ్యోమనౌక ద్వారా ప్రయోగించింది. మంగళవారం ఇవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(International Space Station)కి చేరుకోనున్నాయి. చీమలతో పాటు అవకాడోలు, మనిషి అంత ఎత్తైన రోబో చెయ్యిని స్పేస్ స్టేషన్‌కు స్పేస్ఎక్స్ పంపింది.
నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది స్పేస్ఎక్స్. ఫాల్కన్ రాకెట్ ద్వారా డ్రాగన్ క్యాప్సూల్(dragon spacex)ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 4,800 పౌండ్ల బరువైన పరికరాలు, ఇతర సామగ్రిని దీని ద్వారా పంపించారు. స్పేస్‌స్టేషన్‌లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం నిమ్మకాయలు, ఐస్‌క్రీమ్‌లను సైతం పంపించారు.
చీమలు ఎందుకు?
అమెరికాకు చెందిన 'గర్ల్స్ స్కౌట్స్'.. నాసా ద్వారా ఈ చీమలను అంతరిక్షంలోకి పంపింది. స్పేస్‌లో వీటిపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఉప్పునీటి రొయ్యలు, కొన్ని మొక్కలను సైతం ప్రయోగాల కోసం పంపించింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంపిన విత్తనాలను సైతం డ్రాగన్ క్యాప్సూల్ మోసుకెళ్లింది. కాంక్రీట్, సోలార్ సెల్స్, తదితర మెటీరియల్ సైతం ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి బయల్దేరింది.