ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ఎదుట హల్చల్ చేశారు. పిస్టల్ తీసి పోలీసులను బెదిరించారు. 'కాల్చేస్తా లేదా తానైనా కాల్చుకుంటానని' పోలీసులను బెదిరించారు. అక్కడితో ఆగకుండా పోలీసులను దుర్భాషలాడారు. గాజులు వేసుకోమని విమర్శించారు. పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఆయనను ఆపడం వల్ల శాంతించారు. పోలీసులపై కోపంతో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తర్ప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ మే 4న జరగగా.. రెండో దశ పోలింగ్ మే 11న జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమేఠీలో సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యుడు రాకేశ్ ప్రతాప్ సింగ్, బీజేపీ నేత దీపక్ సింగ్కు బుధవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీపక్ సింగ్ భార్య గౌరీగంజ్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. తమపై దాడి చేసిన బీజేపీ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని రాకేశ్ ప్రతాప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడినా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ ధర్నాకు దిగారు. ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.