Bihar Hooch Tragedy : బిహార్.. తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహారిలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధరించారు. మరో 20 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మోతిహారి ఎస్పీ కాంతేశ్ కుమార్ తెలిపారు. కల్తీ మద్యం కేసులో 80 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులు, 9 మంది వాచ్‌మన్‌లను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కాంతేశ్ చెప్పారు.
"తూర్పు చంపారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 26 మంది మరణించారు. మొదట 22 మంది మరణించగా.. గత పది గంటల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కల్తీమద్యం వ్యాపారం చేస్తున్న 80 మందిని అరెస్ట్ చేశాం. మోతిహరిలోని 600కి పైగా ప్రదేశాల్లో సోదాలు జరిపాం. కల్తీ మద్యం తయారీలో ఉపయోగించిన 370 లీటర్ల దేశీయ మద్యం, 50 లీటర్ల స్పిరిట్, 1,150 లీటర్ల ఇతర రసాయనాలను స్వాధీనం చేసుకున్నాం."
-కాంతేశ్ కుమార్, మోతిహరి ఎస్పీ
తూర్పు చంపారణ్ జిల్లా పరిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు 22 మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. అలాగే గత 10 గంటల వ్యవధిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 26కు చేరింది. అయితే మొదట ఈ మరణాలు కల్తీ మద్యం వల్ల సంభవించాయని ప్రభుత్వం ధ్రువీకరించలేదు. తాజాగా మోతిహరి ఎస్పీ కాంతేశ్ కుమార్.. 26 మంది కల్తీ మద్యానికి బలైనట్లు ధ్రువీకరించారు. తుర్కౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, హర్సిద్ధిలో ముగ్గురు, పహర్‌పూర్‌లో ముగ్గురు, సుగౌలీలో ఐదుగురు మరణించినట్లు కాంతేశ్ కుమార్ తెలిపారు.
దర్యాప్తు జరుపుతున్న పోలీసులు బిహార్లో కల్తీ మద్యం తాగి 22 మంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పందించారు. ఇదొక బాధాకరమైన సంఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల పరిహారం ఇస్తామని నీతీశ్ ప్రకటించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
'నీతీశ్ ప్రభుత్వం.. సామూహిక హత్య'
బిహార్.. మోతిహరిలో కల్తీ మద్యం తాగి 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ ఘటనను నీతీశ్ కుమార్ ప్రభుత్వం చేసిన సామూహిక హత్యగా అభివర్ణించింది. లిక్కర్ మాఫియాను కాపాడడంలోనే అధికార జేడీయూ-ఆర్జేడీ కూటమి నిమగ్నమైందని పేర్కొంది. బిహార్లో 2016 ఏప్రిల్ 5 నుంచి మద్యపాన నిషేధం ఉంది. అయినా రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి వందలాది మంది ఇప్పటివరకు మరణించారు.