Congress in up elections: భాజపా, సమాజ్వాదీ పార్టీ సామాన్యులకు అవసరమైన వాటిపై మాట్లాడకుండా.. ఉగ్రవాదం గురించి ప్రసంగాలు ఇస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళా సాధికారత, చిన్న వ్యాపారులకు, రైతులకు ఆర్థికసాయం లాంటి అంశాలపై చర్చించడం లేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు దృష్టి మళ్లించేందుకు తీవ్రవాదం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిలో తెలిపారు. మహిళా సమస్యలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన తరువాతే ఇతర పార్టీలు వారి ఇబ్బందులుపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు.
"ఈ ఎన్నికల్లో ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం తగ్గింపు, ఉపాధి, మహిళా సాధికారత, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు మద్దతుగా నిలవడం, రైతులకు కనీస మద్దతు ధర లాంటి వాటిపై ఎస్పీ, భాజపా చర్చించడం లేదు. వాటిని పక్కదారి పట్టించి.. ఉగ్రవాదంపై చర్చిస్తున్నారు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
పశువులను విచ్చలవిడిగా వదిలేయడంపై ప్రధాని రాజకీయం చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. గత ఎన్నికల అప్పుడే తాము ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
"మేము 2019 నుంచి విచ్చలవిడిగా వదిలేసిన పశువుల సమస్యను లేవనెత్తుతున్నాము. దానికి సంబంధించిన మా మేనిఫెస్టోలో నష్టపరిహారం కూడా ప్రకటించాము. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి ఇదో పెద్ద సమస్యగా మాట్లాడుతున్నారు. ఉత్తరభారత దేశంలోని చాలా ప్రాంతాల్లో దీని వల్ల చాలా నష్టం జరిగింది. అయితే ప్రధానికి ఇప్పుడే ఇది కనిపించిందా?"
- ప్రియాంక గాంధీ