తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షాలు వచ్చేశాయ్... కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు - నైరుతి రుతుపవనాలు ముందు ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి

Monsoon in Kerala 2023 : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. సాధారణం కంటే వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు వచ్చాయని తెలిపింది.

southwest-monsoon-in-kerala-2023
నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి 2023 telugu

By

Published : Jun 8, 2023, 12:53 PM IST

Updated : Jun 8, 2023, 1:36 PM IST

Monsoon in Kerala 2023 : నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. రుతుపవనాలు వారం ఆలస్యంగా కేరళ తీరాన్ని గురువారం చేరుకున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించినట్లు ఐఎండీ తన ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ సహా కేరళ, తమిళనాడులోని చాలా వరకు ప్రాంతాలపై రుతుపవనాలు ఆవహించాయని వివరించింది. కొమొరిన్ కేప్; గల్ఫ్ ఆఫ్ మన్నార్​తో పాటు ఆగ్నేయ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతానికి గురువారం రుతుపవనాలు వ్యాపించాయని తెలిపింది.

సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. కొన్నిసార్లు ఏడు రోజులు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉంది. రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గత నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రావడం గమనార్హం. మరోవైపు, ప్రైవేటు వాతావరణ సేవల సంస్థ 'స్కైమెట్'.. జూన్ 7న రుతుపవనాలు వస్తాయని ఇదివరకు అంచనా వేసింది. మూడు రోజులు అటూ ఇటూ అవ్వొచ్చని పేర్కొంది.

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపర్జాయ్ తుపాను ప్రభావం వల్ల రుతుపవనాల రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇదివరకు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రుతుపవనాలు కేరళ తీరానికి బలహీనంగా కదలొచ్చని పేర్కొన్నారు. భారత ద్వీపకల్పంలోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించడం సైతం ఆలస్యం కావొచ్చని చెప్పారు. బిపర్జాయ్ ప్రభావంతో వర్షాలు కురిసినా.. రుతుపవనాల విస్తరణ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, రుతుపవనాలపై తుపాను ప్రభావం పెద్దగా పడలేదని తెలుస్తోంది. 48 గంటల్లోగా కేరళను తొలకరి పలకరిస్తుందని ఐఎండీ బుధవారం అంచనా వేయగా... అంతకుముందే రుతుపవనాలు రావడం విశేషం.

నైరుతి ఎంతో కీలకం..
వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటలకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడగానే.. రైతులు నాట్లు వేయడం మొదలుపెడతారు. ఈ రుతుపవనాలు ఆలస్యం అయితే ఖరీఫ్ సీజన్​పై తీవ్ర ప్రభావం ఉంటుంది.

తుపాను అప్డేట్..
ఇదిలా ఉండగా.. అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్జాయ్.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని ఐఎండీ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రకటనలో తెలిపింది. గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 850 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వివరించింది. ముంబయికి నైరుతి దిశలో 900 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉందని తెలిపింది. వచ్చే 24 గంటల పాటు తుపాను మరింత తీవ్రంగా మారి.. ఉత్తర-వాయవ్య దిశలో పయనిస్తుందని స్పష్టం చేసింది.

Last Updated : Jun 8, 2023, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details