బంగాల్లో దీదీ (మమతా బెనర్జీ)ని ఎదుర్కొనేందుకు దాదా (గంగూలీ)ని భాజపాలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదా ఆదివారం.. బంగాల్ గవర్నర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈరోజు దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వేదిక పంచుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా మధ్య రాజకీయంపై చర్చ జరిగిందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఖండించిన గంగూలీ..
అయితే అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. సదరు కార్యక్రమానికి దిల్లీ వెళ్లే సమయంలో విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేం లేదని బదులిచ్చాడు.
"దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను. అమిత్ షాతో ఎలాంటి భేటీ లేదు."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు