Sonu sood help for education: కరోనా కాలంలో ఎందరికో సహాయం చేసి ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూసూద్. ఇప్పటికీ తమకు సాయం చేయాలంటూ అనేక మంది సోషల్ మీడియాలో ఆయనను సంప్రదిస్తుంటారు. అయితే, తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు సోనూసూద్. సర్ఫరాజ్ అనే పేద విద్యార్థి చదువు బాధ్యతల్ని తీసుకున్నారు.
ఇటీవల తన పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టింగ్ చేశాడు సర్ఫరాజ్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనిని చూసిన సోనూసూద్ తాజాగా స్పందించారు. సర్ఫరాజ్ చదువు కోసం ముంబయిలో అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఝార్ఖండ్ గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొన్నేళ్లుగా అనేక సమస్యలు తిష్టవేశాయి. దీంతో విద్యార్థుల శాతం కూడా తగ్గిపోయింది. దీన్నంతా గమనించిన సర్ఫరాజ్ అనే ఓ 12 ఏళ్ల విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. దాన్ని పట్టుకుని సమస్యలను చూపిస్తూ వివరించాడు.
పిచ్చి మొక్కలను చూపిస్తున్న విద్యార్థి "మా గ్రామంలో పాఠశాల పరిస్థితి గురించి మీకు వివరిస్తా. విద్యార్థులకు కనీసం తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు సక్రమంగా రావడం లేదు".. అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని కళ్లకుగట్టాడు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు.. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెట్టి షేర్ చేశారు.