Sonlai Phogat Cctv Video: టిక్‌టాక్ నటి, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్(42) అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె అద్దెకు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్ పత్రాల్లో సోనాలీ పేరు.. ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ భార్యగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 102లో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను సోనాలీ అద్దెకు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాల్లో సోనాలీ పేరు తన పర్సనల్ అసిస్టెంట్ అయిన సుధీర్ సంగ్వాన్ భార్యగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అపార్ట్‌మెంట్‌కు సోనాలీ తరచూ వచ్చేవారు. గోవాకు వెళ్లే ముందు కూడా ఆమె తన సహాయకుడితో కలిసి ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఈ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసు వెరిఫికేషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
గోవా క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ అరెస్టు..
గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ గత సోమవారం అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వీరిని నేడు కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
మరోవైపు, చనిపోవడానికి ముందు సోనాలీ పార్టీకి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోయంకర్ నుంచి తాము డ్రగ్స్ తీసుకున్నట్లు సోనాలీ సహాయకులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ డ్రింక్‌ను వారే బలవంతంగా సోనాలీతో తాగించినట్లు కూడా నిందితులు ఒప్పుకున్నారు. అయితే ఈ 'హత్య'కు దారితీసిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.