కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ పాలసీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 18 ఏళ్లుపైబడిన వ్యక్తులకు టీకా ఉచితంగా ఇవ్వకపోవడాన్ని సోనియా తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా నియంత్రణపై గతేడాది పాఠాలు నేర్చుకున్నప్పటికీ.. ప్రభుత్వం వివక్షపూరిత విధానాన్నే అవలంబించడం బాధాకరమని అన్నారు.
"టీకా పాలసీని చూస్తుంటే 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలన్న బాధ్యతను ప్రభుత్వం వదిలించుకున్నట్లు తెలుస్తోంది. తప్పుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందులో ప్రధాని జోక్యం చేసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో ఒకే ధరకు టీకా అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు.. ఇలా లాభాలు సంపాదించడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి