Sonia Gandhi Secularism : లౌకిక భావన భారత ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, ఆ పదాన్ని ఉపయోగించడమే అవమానకరమనేలా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అధికార పార్టీ తీరుతో సమాజంలో విభజన పెరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం సాఫీగా సాగేలా చూసే రక్షణలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 2024 మనోరమ ఇయర్బుక్లో ఈ మేరకు వ్యాసం రాశారు.
"ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే భావనల మధ్య లోతైన అనుసంధానం ఉంటుంది. సామరస్య సమాజం దిశగా ప్రభుత్వాన్ని ఇవి నడిపిస్తాయి. మనకు ఈ రెండు పదాల గురించి తెలుసు. రాజ్యాంగంలోని పీఠికతో పాటు అనేక ప్రసంగాలు, పుస్తకాలు, చర్చల్లో వినే ఉంటాం. అయినప్పటికీ వీటి అసలు అర్థం అంతుచిక్కదు. వీటిని పౌరులు బాగా అర్థం చేసుకుంటే భారత చరిత్ర, ప్రస్తుతం ఉన్న సవాళ్లు, భవిష్యత్ మార్గాలపై స్పష్టత వస్తుంది."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి
'గాంధీ చెప్పిన లౌకికత్వమే భేష్!'
లౌకికత్వాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చని, కానీ 'సర్వ ధర్మ సమ భావ' అని మహాత్మా గాంధీ ఇచ్చిన వివరణ భారత్కు సరిగ్గా నప్పుతుందని సోనియా పేర్కొన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యతను గాంధీజీ గుర్తించారని, బహుళ మత సమాజంగా భారత్ వర్ధిల్లాలని జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షించారని గుర్తు చేశారు. అందుకే నిరంతరం లౌకిక రాజ్య ఏర్పాటుకు నెహ్రూ కృషి చేశారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్మాతలు సైతం ఈ భావనను ప్రభుత్వానికి అన్వయించారని, తద్వారా ప్రత్యేక లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.
"ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను పరిరక్షిస్తుంది. మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుంది. సమాజంలోని భిన్న వర్గాల మధ్య సామరస్యం, శ్రేయస్సును నెలకొల్పడమే భారత లౌకిక ప్రజాస్వామ్య మార్గదర్శక సూత్రం. మన సమాజంలో భిన్న విశ్వాసాలతో పాటు భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతాలు, చరిత్ర వంటి విషయాల్లోనూ వైవిధ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ ఐక్య భావన మాత్రం ఉంటుంది. కానీ మన ఉన్నత రాజ్యాంగం ఇప్పుడు దాడికి గురవుతోంది.