Sonia Gandhi PCC chiefs resign: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు ఉద్వాసన పలికారు! వీరిలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. పీసీసీలను పునర్‌వ్యవస్థీకరించేందుకు వీలుగా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేయాలని సోనియా గాంధీ కోరినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విటర్‌లో వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా.. ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా చతికిలపడింది కాంగ్రెస్. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇంకొంత కాలం సోనియా గాంధీయే కొనసాగాలని నిర్ణయించారు. అలాగే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపోటమిలకు కారణాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఉత్తరాఖండ్ పీసీసీ రాజీనామా..
పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించినట్లు ఆయన తెలిపారు.