Sonia Gandhi Parliament Speech Today : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపిన సోనియా.. ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ అధినియమ్కు మద్దతుగా తాను ఇక్కడ నిలబడ్డానని తెలిపారు. అడ్డంకులు అన్నింటిని తొలగించి మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని సోనియా కోరారు.
"భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను '2023-నారీశక్తి వందన్ అధినియమ్'కు మద్దతు తెలుపుతున్నాను. ఈ బిల్లు ఆమోదం పొందుతున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం. అలాగే ఆందోళనగా కూడా ఉన్నాం. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. గడచిన 13 ఏళ్లుగా భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతల కోసం వారు ఇంకా కొన్నాళ్లు ఆగాలి. అదే ఎన్నాళ్లు? రెండేళ్లా, నాలుగేళ్లా.. ఆరేళ్లా.. ఎనిమిదేళ్లా? చెప్పండి. భారత మహిళలతో ఇలాంటి ప్రవర్తన సరైదనదేనా? ఈ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియమ్)ను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కుల గణనను కూడా నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లోని మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాం."
--సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ