హక్కుల నేత స్టాన్ స్వామి మృతిపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా 10 విపక్ష పార్టీల నేతలు. స్టాన్ స్వామిపై తప్పుడు కేసులు బనాయించి, నిరంతరం నిర్భందంలోనే ఉండేలా అమానవీయంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సోనియా గాంధీతో పాటు మాజీ ప్రధాని దేవె గౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, డి. రాజా, సీతారాం ఏచూరీ, తేజస్వీ యాదవ్ సంతకాలు చేసినవారిలో ఉన్నారు.
భీమా కొరేగావ్ నిందితుడిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఆయన చనిపోయారని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. భీమా కొరెగావ్ సహా రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలుపాలైనవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.