Sonia Gandhi on Bangladesh independence: 50 ఏళ్ల క్రితం ధైర్యవంతులైన బంగ్లాదేశ్ ప్రజలు తమకోసం కొత్త భవిష్యత్తును సృష్టించుకున్నారని, భారత్ వారి పక్షాన నిలబడి కోటి మంది శరణార్థులకు సొంత ఇంటిని ఇచ్చిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా.. ఆ దేశ స్వతంత్ర సమరయోధులను మరిచిపోకూడదన్నారు సోనియా.
" ఈరోజు మనం ఇందిరాగాంధీని ఎంతో గర్వంగా స్మరించుకుంటున్నాం. ఆమె ధైర్యం ఇప్పటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 1971 చాలా విధాలుగా ఇందిరా గాంధీకి ఉత్తమమైన సంవత్సరం. బంగ్లాదేశ్ ప్రజల కోసం యావత్ ప్రపంచాన్ని చైతన్య పరిచారు. 1971 నాటి పోరాటం.. ప్రణాళికాబద్ధంగా, సంపూర్ణంగా అమలు చేసిన రాజకీయ, దౌత్య, సైనిక వ్యూహాల అసాధారణ కలయిక. అది ఒక ఉపఖండం చరిత్రలో 1971కి విశిష్ట స్థానాన్ని ఇచ్చింది. భౌగోళిక పరిస్థితులను మార్చిన చరిత్ర. భారత సైనిక దళాలు ఎంతో ధైర్య సాసహాలను ప్రదర్శించాయి. "