Sonia Gandhi News: కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. గతంలో ఎన్నడూ లేనంత పెను సవాలును పార్టీ ఎదుర్కొంటోందని దిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. తిరిగి పుంజుకోవడంలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి, స్ఫూర్తికి ప్రస్తుత పరిస్థితి కఠిన పరీక్ష అన్నారు సోనియా. భాజపా విభజన రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధినేత్రి.
"సమాజంలో చీలిక తెచ్చేలా అధికార పక్షం, ఆ పార్టీ నేతలు అమలు చేసే అజెండా క్రమంగా ప్రతి రాష్ట్రంలోనూ సాధారణ రాజకీయ అంశంగా మారుతోంది. ఈ అజెండా కోసం చరిత్రను, వాస్తవాలను కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారు. ఈ విద్వేష శక్తులకు ఎదురొడ్డి నిలవాల్సిన బాధ్యత మనదే. శతాబ్దాలుగా మన సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగేందుకు ఉపకరించే మైత్రిని, సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను మనం అడ్డుకుని తీరాలి. కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడం.. మనకు మాత్రమే సంబంధించిన విషయం కాదు.. ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఎంతో అవసరం" అని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు సోనియా.
ప్రత్యర్థులపై దాడులు: విపక్షాలను, ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను అధికార పక్షం వేధిస్తోందని ఆరోపించారు సోనియా. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. 'కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన' అనే ఎన్డీఏ ప్రభుత్వ నినాదాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "అధికారంలో ఉన్న వారి దృష్టిలో 'గరిష్ఠ పాలన' అంటే ప్రత్యర్థులను గరిష్ఠ భయానికి, బెదిరింపులకు గురిచేయడమే. అలాంటి బెదిరింపులు, ఎత్తుగడలు మనల్ని భయపెట్టలేవు." అని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధినేత్రి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగడం గమనార్హం. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్లమెంటు ఉభయసభల్లోని కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. మరోవైపు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించేందుకు 'చింతన్ శిబిర్' నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ, ఎప్పుడు చేపట్టాలో త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించనుంది. పార్లమెంటు సమావేశాలు ముగిశాక.. రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక చోట చింతన్ శిబిర్ జరిగే అవకాశముంది.
పార్లమెంటు ఆవరణలో చిదంబరం, అమిత్ షా పరస్పర అభివాదం ఇదీ చూడండి :రాహుల్‌పై అభిమానం.. రూ.లక్షల ఆస్తిని రాసిచ్చిన మహిళ