తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరికొందరు జి-23 నేతలతో సోనియా భేటీ.. త్వరలోనే.. - కాంగ్రెస్‌

Sonia Gandhi: కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై దృష్టి సారించిన సోనియా గాంధీ.. జి-23 నేతలతో సమావేశాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి నేతలతో మంగళవారం సమావేశమై.. పార్టీ బలోపేతానికి వారి నుంచి సూచనలను స్వీకరించినట్లు తెలుస్తోంది.

G23 leaders
Sonia Gandhi

By

Published : Mar 23, 2022, 5:28 AM IST

Sonia Gandhi: కాంగ్రెస్‌లో సంస్థాగత, నాయకత్వ సంస్కరణలు కోరుతున్న 'జి-23 బృందం' నేతలతో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భేటీలు కొనసాగుతున్నాయి. పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై దృష్టి సారించిన ఆమె.. సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ ఉపనేత ఆనంద్‌ శర్మ, లోక్‌సభ ఎంపీ మనీశ్‌ తివారీ, రాజ్యసభ ఎంపీ వివేక్‌ ఠంఖాలు మంగళవారం సోనియాగాంధీతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, వచ్చే ఎన్నికల్లో భాజపాను దీటుగా ఎదుర్కోవడానికి అధ్యక్షురాలికి వారు పలు సూచనలు చేసినట్టు తెలిసింది.

జి-23 బృందానికి చెందిన మరికొందరు నేతలతోనూ సోనియా త్వరలోనే సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అగ్రనేత రాహుల్‌గాంధీ విధేయులుగా గుర్తింపు పొందిన కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, అజయ్‌ మకెన్‌లను ఏఐసీసీ పదవుల నుంచి తప్పించాలని జి-23 నేతలు అధిష్ఠానంపై డిమాండ్‌ చేస్తున్నారు. వీరి సూచనలు, సలహాలు తీసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సానుకూలంగా స్పందించిన పార్టీ నాయకత్వం.. వీరిలో కొందరికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, లేదా పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి:సోనియాతో ఆజాద్​ భేటీ.. 'ఐక్య పోరాటం'పై చర్చ!

ABOUT THE AUTHOR

...view details