Sonia Gandhi Letter To Modi : అజెండా ఏంటో చెప్పకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారు. ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విపక్షాలతో చర్చించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా పార్లమెంటును సమావేశపరచడం గతంలో ఎన్నడూ జరగలేదని విమర్శించారు. నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో.. విపక్షాలు లేవనెత్తే అంశాల్నీ ఈ సమావేశాల్లో చర్చిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు సోనియా. సభలో చర్చకు చేపట్టాల్సిన 9 అంశాలను లేఖలో ప్రస్తావించారు.
సోనియా గాంధీ లేఖలో ప్రస్తావించిన అంశాలు
- అదానీ అక్రమాలపై జేపీసీ ఏర్పాటు
- మణిపుర్ అల్లర్లు
- సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలు
- రైతు సమస్యలు
- కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ
- కులాల వారీగా జనగణన
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు
- ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం
- హరియాణా సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు
'పార్లమెంటు పనితీరును రాజకీయం చేస్తున్నారు'
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుపట్టారు. పార్లమెంటు పనితీరును రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు, కార్యకలాపాలను రాజకీయం చేయడం దురదృష్టకరమని అని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అజెండాను ప్రకటించకుండా పార్లమెంటును ప్రత్యేకంగా ప్రభుత్వం సమావేశపరుస్తోందని సోనియా పేర్కొనడంపై మండిపడ్డారు.
సమావేశాల్ని బహిష్కరిస్తారా?
Congress On Parliament Special Session :అయితే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్ని బహిష్కరించే ఆలోచన కాంగ్రెస్కు లేదని ఆ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రతి పార్టీ తన వంతు కృషి చేస్తుందని అన్నారు జైరాం రమేశ్. ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడిన రమేశ్.. అజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని విమర్శించారు.