Sonia Gandhi Health : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. అనారోగ్య సమస్యలతో దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప జ్వరం లక్షణాలతో.. సోనియా ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు పరీక్షిస్తున్నట్లు.. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపాయి.
India Alliance Sonia Gandhi : ఇటీవలే ముంబయిలో జరిగిన విపక్ష కూటమి 'ఇండియా'.. మూడో సమవేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. రెండురోజుల పాటు జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశాల్లో పాల్గొన్నారు. కూటమి తీసుకున్న పలు నిర్ణయాల్లో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
అయితే ఈ ఏడాది మార్చి 3న కూడా సోనియా.. సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం బారిన పడ్డ సోనియా.. ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొంది కోలుకున్నారు. జనవరిలోనూ అనారోగ్యం పాలైన ఆమె.. గంగారామ్ ఆస్పత్రిలోనే చేరారు. అయితే సోనియా.. 2022లో రెండుసార్లుకరోనా బారిన పడ్డారు. జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కొవిడ్ సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి.
రాజకీయాలకు సోనియా గుడ్‌బై?
Sonia Gandhi Political Career : ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పార్టీ ప్లీనరీలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. భారత్ జోడో యాత్రతో'తన ఇన్నింగ్స్' ముగిసినందుకు సంతోషంగా ఉందని ఆమె అనడం వల్ల సోనియా రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వచ్చాయి. సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు, వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోరంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
ఆ సమయంలో ఊహాగానాలు తీవ్రం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని చెప్పారే తప్ప.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటం సోనియా ఉద్దేశం కాదని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కుమారి షెల్జా తెలిపారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర ప్రారంభమైందనే విషయాన్ని సూచిస్తూ అలా వ్యాఖ్యానించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వివరణతో సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది.
సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విపక్ష మీటింగ్ వెళ్లి వస్తుండగా..
'రాహుల్‌కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ