దేశ రాజధానిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Cwc Congress) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలతో పాటు దేశంలోని అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi News) మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మూడు నల్ల చట్టాలను పార్లమెంట్ ఆమోదించి ఏడాదైంది. రైతులు, రైతు సంఘాల ఆందోళన కొనసాగుతోంది. కొన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనానికే ఈ మూడు నల్లచట్టాలు (Farm Bills) తీసుకొచ్చారు. నల్ల చట్టాల ఆమోదానికి అందరినీ నరకయాతన పెట్టారు. నిరసనలతో రైతులు ఎంతో నష్టపోయారు. లఖింపుర్ ఖేరీ ఘటన భాజపా మనస్తత్వాన్ని బయటపెట్టింది. రైతుల పట్ల భాజపాకు ఎలాంటి ఆలోచన ఉందో దీనిద్వారా తెలిసింది' అన్నారు.
రక్షిస్తున్నామంటూ ప్రమాదంలోకి నెడుతున్నారు..
'దేశ ఆర్థిక పరిస్థితి (Indian Economy) చాలా ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవట్లేదు. దశాబ్దాల కాలంగా నిర్మించిన ఆస్తులను అమ్మేస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల సాధికారత ప్రమాదంలో పడింది. రక్షిస్తున్నామనే పేరుతో మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు' అని సోనియా ఆరోపించారు.
ప్రధాని మౌనం.. దేశాన్ని నష్టపరుస్తోంది
'పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రజల జీవితాన్ని భరించలేనంతగా మారుస్తున్నారు. రాష్ట్రాల డిమాండ్‌తోనే టీకా సేకరణలో కేంద్రం మార్పులు చేసింది. మైనార్టీలే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న హత్యలను ఖండిస్తున్నాం. అనాగరిక నేరాలకు పాల్పడిన వారిని కేంద్రం శిక్షించాలి. పొరుగు దేశాలతో అనుసరించే విధానంలో ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు. సరిహద్దుల్లో, ఇతర రంగాల్లో దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది. చైనా ఎలాంటి ఆక్రమణ చేయలేదని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మౌనం.. దేశాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది' అని అన్నారు.