భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతిపై హత్య కేసు నమోదైంది. శవపరీక్ష నివేదిక ఆధారంగా గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆమె సహాయకులు సుధీర్ సగ్వాన్, సుఖ్విందర్ వాసిని నిందితులుగా చేర్చారు. వెంటనే వీరిని అరెస్టు చేశారు. సోనాలి వెంట గోవా వెళ్లిన ఇద్దరు సహాయకులే ఆమెను హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు రింకు ధాక.. పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. చనిపోవటానికి ముందు సోనాలి.. తన తల్లి, సోదరి, బావతో మాట్లాడినట్లు చెప్పారు. సోనాలి మాటల్లో ఆందోళన కనిపించిందని వెల్లడించారు. దీంతో ఇద్దరు సహాయకులపై ఫిర్యాదు చేసినట్లు ఆమె సోదరుడు తెలిపారు.
టిక్‌టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్ - సోనాలీ ఫోగాట్ మరణం
టిక్‌టాక్ స్టార్, భాజపా నేత సోనాలీ ఫోగాట్ మృతిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె సహాయకులు ఇద్దరిని నిందితులుగా చేర్చారు. వీరిని అరెస్టు చేశారు.
గురువారం ఉదయం సోనాలీ ఫోగాట్ మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. గోవా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ నిపుణుల ప్యానెల్ శవపరీక్ష చేసింది. ఆమె శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉన్నాయని ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ వైద్యుడు సునీల్ శ్రీకాంత్ చింబోల్కర్ తెలిపారు. ఇది ఎలాంటి మరణం అనే విషయాన్ని దర్యాప్తు అధికారులే తేల్చాలని అన్నారు.
టిక్‌టాక్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్ అయిన సోనాలీ ఫోగాట్(41)సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆమె మరణించారని భాజపా నాయకులు తెలిపారు. హరియాణాకు చెందిన ఆమె.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదంపుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇటీవలే భాజపాలోకి చేరిన కుల్దీప్ బిష్ణోయ్‌పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని బుల్లితెరపై సందడి చేశారు. సోనాలి భర్త సంజయ్ ఫోగాట్ 2016లో చనిపోయారు.