ఛత్తీస్‌గఢ్‌లో ఓ యువకుడు.. తన తల్లిదండ్రులు, నాన్నమ్మను చంపేసి పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. వారు ముగ్గురు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. చివరకు అసలు నిజం బయటపడి కటాకటాలపాలయ్యాడు.
పోలీసులు ఏం చెప్పారంటే?
మహాసముంద్ జిల్లాలోని పుట్కా గ్రామానికి చెందిన ప్రభాత్ భోయ్, అతడి భార్య జర్నా భోయ్, ప్రభాత్ తల్లి సులోచన కనిపించడం లేదని ప్రభాత్ కుమారుడు ఉదిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని ఉదిత్ పోలీసులకు చెప్పాడు. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఉదిత్ తమ్ముడు అమిత్ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు, నాన్నమ్మ కనిపించడం లేదని తెలుసుకున్నాడు. ఇంటి ప్రాంగణంలో రక్తపు మరకలు గమనించాడు. ఇంటి వెనుక కర్రలు కాలిపోయి బూడిదగా ఉన్నట్లు చూశాడు. ఏం జరిగిందో తెలియక పోలీసులకు సమాచారం అందించాడు. ఇంటికి వచ్చి అన్నీ పరిశీలించిన పోలీసులు.. ఉదిత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. అప్పుడు అసలు విషయాలను బయటపెట్టారు.
తాను విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నానని.. కానీ ఇంట్లో ఎవరూ డబ్బులు ఇవ్వలేదని అందుకే చంపేశానని ఉదిత్ పోలీసులకు తెలిపాడు. తండ్రి ప్రభాత్ భోయ్ తాగే అలవాటుతో తరచూ కోపంగా ఉండేవాడని.. ఇంటి వాతావరణం చెడిపోయిందని చెప్పాడు. మే 8వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో దాడి చేసి చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని శానిటైజర్‌తో శుభ్రం చేశానని తెలిపాడు. ఇంటి వెనుక ఉంచిన కలపను ఉపయోగించి ముగ్గురి మృతదేహాలను దహనం చేశానని చెప్పాడు.
ఇద్దరు బాలికలు కిడ్నాప్.. ఏడుగురు యువకులు గ్యాంగ్‌రేప్..
ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఇద్దరు చిన్నారులపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన 15 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఏడుగురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు
ఇదీ జరిగింది
జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో మే1వ తేదీన జరిగిన వివాహ వేడుకలకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరినీ ఏడుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఈ విషయాన్ని ఓ బాధితురాలు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విషయం బయటకొచ్చింది.
మైనర్ల ఆరోగ్యం క్షీణించడం వల్ల బాధితురాళ్ల బంధువులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు గురువారం ఉదయం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. బాలికలను వైద్య పరీక్షల చేయించి మెరుగైన చికిత్స అందించారు.