Son Murdered Mother By Slitting Her Throat : ఆస్తి వివాదంతో తల్లిని దారుణంగా హత్య చేశాడో కుమారుడు. అనంతరం ఆమె తలను నరికి తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అతడి నుంచి మృతురాలి తలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది
మిర్జాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కమలా దేవికి (65) చాలా ఏళ్ల క్రితం హరిద్వారితో వివాహం జరగగా దినేశ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, కొన్నేళ్ల కింద హరిద్వారి మరణించాడు. దీంతో అతడి ఆస్తి భార్య కమలా దేవి, కుమారుడు దినేశ్ పేరిట మారిపోయింది. హరిద్వారి మరణించిన తర్వాత కమలా దేవి మరో వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీంతో తన తండ్రి ద్వారా వచ్చిన ఎకరన్నర ఆస్తిని తిరిగి ఇవ్వాలని కోరాడు. దీనికి కమలా దేవి అంగీకరించకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని భావించాడు నిందితుడు దినేశ్. శనివారం ఉదయం మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన కమలా దేవి గొంతు కోసి, తలను నరికి హత్య చేశాడు. అనంతరం ఆమె తలను తీసుకుని పరారయ్యాడు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఊరి బయట కమలా దేవి తలతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి మరో కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.