మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఇటుకతో బలంగా తలపై బలంగా కొట్టి దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఇంటికి తాళం వేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య జరిగిన రెండు వారాల తరువాత విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోవిందరాజానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడిని నీలందర్గా పోలీసులు గుర్తించారు. నీలందర్తో పాటు అతడి తండ్రి.. బసవరాజ(60) మారేనహళ్లి ప్రాంతంలో ఓ షెడ్డు వేసుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. నీలందర్ ఆటో డ్రైవర్ కాగా.. బసవరాజ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్ది కాలంగా నీలందర్ మద్యానికి బానిస అయ్యాడు. ఆటో నడపగా వచ్చిన ఆదాయం మొత్తాన్ని.. తాగేందుకే ఖర్చు చేస్తున్నాడు.
ఏప్రిల్ 10న నీలందర్ తండ్రి వద్దకు వచ్చి.. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆగ్రహంతో తండ్రి ఇటుక రాయితో కొట్టి చంపాడు నీలందర్. అనంతరం పారిపోయాడు. బుధవారం షెడ్ నుంచి దుర్వాసన రావటాన్ని గమనించిన స్థానికులు.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతడి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
మానసిక సమస్యలతో బాధపడుతున్న బాలుడిపై వైద్యుడి వేధింపులు!
కౌన్సెలింగ్ కోసం వచ్చిన ఓ పదమూడేళ్ల బాలుడిపై.. అత్యాచార వేధింపులు చేసిన మానసిక వైద్యుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కేరళ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు. లక్షన్నర రూపాయలు.. బాలుడికి చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే మరో నాలుగేళ్ల జైలు జీవితం అదనంగా గడపాలని సూచించింది. 2015 నుంచి దాదాపు రెండేళ్ల పాటు బాధిత బాలుడ్ని వేదింపులకు గురిచేశాడు వైద్యుడు.
బాధిత బాలుడికి మానసిక ఆరోగ్యం బాగా లేని కారణంగా.. డాక్టర్ గిరీశ్‌ని కుటుంబసభ్యులు సంప్రదించారు. డాక్టర్ గిరీశ్.. కేరళ హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. దాంతో పాటు ఓ ప్రైవేటు క్లినిక్‌ను సైతం నడుపుతున్నాడు. 2015 డిసెంబర్ ఇదే క్లినిక్ బాలుడిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. 2017 వరకు అతడి వద్ద చికిత్స తీసుకున్నారు. ఈ రెండేళ్ల పాటు బాలుడిని తీవ్ర వేధింపులకు గురిచేశాడు డాక్టర్ గిరీశ్. ఎవరికి చెప్పొద్దని బాలుడుని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు ఘటన గురించి ఎవరికి చెప్పలేదు.
వైద్యుడు చేసిన నిర్వాకానికి బాలుడి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో బాలుడిని వేరే డాక్టర్ వద్ద చూపించాలని సలహా ఇచ్చాడు డాక్టర్ గిరీశ్. అనంతరం 2019లో తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు బాలుడిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడి బాలుడి పరిస్థితిని గమనించిన వైద్యులు.. పూర్తి వివరాలను అతడి నుంచి ఆరా తీశారు. జరిగిన విషయాన్ని వైద్యులకు వివరించాడు బాలుడు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కోర్టులో హాజరు పరిచారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కోర్టు.. గురువారం నిందితుడికి శిక్ష విధిస్తు ఆదేశాలు జారీ చేసింది.
పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం లేకుండా చేస్తానని.. దంపతులకు తాంత్రికుడు టోకరా..
గర్భంలో అంగవైకల్యంతో ఉన్న శిశువును ఆరోగ్యంగా మారుస్తానని చెప్పి.. దంపతుల నుంచి లక్షన్నర రూపాయలు తీసుకున్నాడు మహేశ్ అనే వ్యక్తి. తాంత్రిక పూజలతో శిశువు అంగవైకల్యాన్ని తొలగిస్తానని ఆ దంపతులను నమ్మించాడు. అనంతరం శిశువు అంగవైకల్యంతో పుట్టడం వల్ల మోసపోయామని తెలుసుకున్న దంపతులు.. పోలీసులను ఆశ్రయించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కంగ్సియాలీ గ్రామానికి చెందిన బకుల్ హస్ముఖ్ చావ్డా, అతడి భార్య భారతీబెన్.. ఇలా తాంత్రికుడి చేతిలో మోసపోయారు. అంతకు ముందు ఆ గర్భిణీ వైద్యులను సంప్రదించింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగా లేడని, అంగవైకల్యం ఉందని.. అబార్షన్ చేసుకోవాలని సూచించారు. అందుకు ఒప్పుకోని ఆ మహిళ.. భర్తతో కలిసి తాంత్రికుడు మహేశ్‌ను ఆశ్రయించింది. వీళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు.. వారి నుంచి దోచుకున్నాడు. అనంతరం జన్ విజ్ఞాన్ జాతా అనే సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రంగులు పూస్తు.. విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన..
హోలీ పండగ రోజు.. రంగులు పూసే నెపంతో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ వీడియో బయటకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి.. జైలుకు పంపించారు. ఉత్తర్‌ప్రదేశ్.. మీర్జాపుర్ జిల్లాలోని ఐటీఐ కాలేజీలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.