Son see mother after 12 years: కేరళ పథానంతిట్టలోని పుష్పగిరి ఆస్పత్రిలో అరుదైన సంఘటన జరిగింది. ఓ తల్లి, కుమారుడు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు. వీడియోకాల్‌లో మాట్లాడుతూ.. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సన్నివేశం ఆస్పత్రి సిబ్బందిని కదలించింది.
ఏం జరిగింది?
బంగాల్ క్రిష్ణానగర్‌కు చెందిన లోకి సర్కార్ 12 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమెకు మతిస్తిమితం లేదు. ఎన్ని రోజులు గడిచినా ఇంటికి తిరిగిరాలేదు. చాలా కాలం పాటు వెతికిన కుటుంబసభ్యులు లోకి మరణించి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె చాలా ప్రాంతాలు తిరుగుతూ.. చివరికి ఇంటి అడ్రస్ మరిచిపోయింది.
11 నెలల క్రితం కేరళ చేరుకుంది. బెథాని స్నేహాలయం ఆమెకు ఆశ్రయం కల్పించింది. అయితే అనారోగ్యానికి గురై కామెర్లు రావడం వల్ల లోకిని పథానంతిట్టలోని పుష్పగిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడే డా.మనోజ్ గోపాల్ ఆమె పరిస్థితిని గమనించారు. ఆమె స్వస్థలం ఎక్కడని తెలుసుకునే ప్రయత్నం చేశారు. బెథాని స్నేహాలయం సిబ్బందిని వివరాలు అడిగారు. లోకికి మతిస్తిమితం సరిగా లేకపోవడం వల్ల తన ఊరు పేరు చెప్పలేకపోయింది. ఆమె బెంగాలీ అని గమనించిన డా.మనోజ్ బంగాల్లో పనిచేసిన తన బంధువు మాయ శేఖర్ సాయం తీసుకున్నారు.
మాయ పదే పదే ప్రయత్నించడం వల్ల లోకి ఎట్టకేలకు తన అడ్రస్ గుర్తుకు తెచ్చుకుంది. పోస్టల్ శాఖలో తనకు తెలిసిన వారిని సంప్రదించి లోకి కుటుంబసభ్యులు వివరాలు సేకరించారు మనోజ్. లోకి కుమారుడు సౌరభ్ సర్కార్ ఫోన్ నంబర్ సంపాదించారు. అనంతరం ఆ నంబర్‌కు వీడియోకాల్ చేశారు. దీంతో 12 ఏళ్ల తర్వాత తల్లిని చూసిన కుమారుడు ఆనందంలో మునిగిపోయాడు. లోకికి చికిత్స అందించిన వైద్యులు ఎట్టకేలకు ఆమెను తన కుటుంబం చెంతకు చేర్చారు. దీంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి:యువకుడి బ్రెయిన్ డెడ్.. అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ