అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేం. కొందరికి అలా కలిసి వస్తుందంతే..! కేరళలోని కాసరగోడ్‌లో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అప్పులు తీర్చేందుకు తన కలల ఇంటిని అమ్మడానికి కొద్ది గంటల ముందే ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ తగలగా అతడి జీవితమే మారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన మహమ్మద్ బవ (50 ఏళ్లు) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎనిమిది నెలల క్రితమే 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టుకున్నాడు. అయితే, తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు.. తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్ పంపేందుకు బ్యాంకులు, బంధువుల నుంచి దాదాపు రూ.50లక్షల వరకు రుణం తీసుకొని తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు ఇంటిని రూ.40లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైన బవ.. సోమవారమే కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకున్నాడు.