మానవ హక్కుల పేరుతో కొంతమంది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని.. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ(Modi news) సూచించారు. స్వప్రయోజనాలు, రాజకీయ లాభం కోసం మానవ హక్కులను వాడుకునే కొందరు వ్యక్తుల విధానాలు.. ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. 28వ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)(NHRC news) వ్యవస్థాపక దినోత్సవ(NHRC foundation day) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు.
మానవ హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ప్రధాని.. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళలకు కొత్త హక్కులు కల్పించామన్నారు. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవు, అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలను రూపొందించామని వివరించారు. స్వాతంత్య్ర పోరాటం, భారతదేశ చరిత్ర మానవ హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిదాయకమని మోదీ(Modi latest news) అన్నారు.
"గత కొన్నేళ్లుగా దేశంలోని విభిన్న వర్గాల్లో వివిధ స్థాయుల్లో ఉండే అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం. దశాబ్దాలుగా ముస్లిం మహిళలు ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. మేము.. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చి వారికి కొత్త హక్కులను అందించాం. హజ్‌కు వెళ్లే సమయంలో ఉండే మహ్‌రమ్ కట్టుబాటు నుంచి ముస్లిం మహిళలకు మా ప్రభుత్వం విముక్తి కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా మహిళలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనేక రంగాల్లో మహిళలకు ప్రవేశం కూడా ఉండటం లేదు. మహిళలకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం మహిళల కోసం అనేక రంగాల తలుపులను తెరిచాం."