నాగరిక సమాజంలో మానవ మనుగడకు అత్యవసరమైన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు రాజ్యాంగ విలువలను కాపాడటమే న్యాయ కోవిదుడు సోలీ సొరాబ్జీకి నివాళి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆయన లాంటి వారు నిరంతరం మన జ్ఞాపకాల్లో జీవించే ఉంటారని చెప్పారు. సొరాబ్జీ కుటుంబసభ్యులు, ఆయన వద్ద పని చేసిన న్యాయవాదులు కలిసి ఏర్పాటు చేసిన సంతాప సభలో జస్టిస్ రమణ పాల్గొని స్మారకోపన్యాసం చేశారు.
రాజ్యాంగ హక్కుల పోరాట యోధుడిని కోల్పోయి అప్పుడే నెల రోజులైందంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల్లాంటి రాజ్యాంగ సూత్రాలపై అకుంఠిత విశ్వాసం ఉన్న వ్యక్తి సొరాబ్జీ అన్న జస్టిస్ రమణ.. ఎమర్జెన్సీ రోజుల్లో పౌర స్వేచ్ఛను బలంగా సమర్థించారని గుర్తు చేశారు. ఎన్నో గొప్ప కేసుల్లో న్యాయవాదిగా, అటార్ని జనరల్‌గా ఆయన ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.