Soldier Missing In Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ సైనికుడు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. కుల్గామ్ జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల జావేద్ అహ్మద్ వానీ భారత సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నారు. లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటుకు చెందిన జావేద్.. లద్దాఖ్‌లోని లేహ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కుల్గామ్ జిల్లాలో నివసించే ఆయన.. సెలవులపై ఇంటికి వచ్చి అదృశ్యమయ్యారు. ఆదివారం విధుల్లో చేరాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు జావేద్ అహ్మద్.. రాత్రి అయినా తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పరన్హాల్ సమీపంలో అతని కారును గుర్తించారు. కారుకు లాక్ వేయకపోగా అందులో జావేద్ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, కారులో రక్తపుమరకలు ఉన్నాయనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగాయి. జవాన్ జాడ కోసం ఆర్మీ, పోలీసులు ముమ్మరంగా.. గాలింపు చేపట్టారు. భద్రతా దళాలు కారు కనిపించిన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని.. జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సెలవుపై ఇంటికి వచ్చిన కొంతమంది సైనికులను ఉగ్రవాదులు అపహరించి కడతేర్చిన ఘటనలు గతంలో జరిగాయి. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి బోరున విలపిస్తున్నారు. తన కుమారుడిని విడుదల చేయాలని జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ కుటుంబాన్ని పోషించేది అతడు ఒక్కడే అని.. అతణ్ని విడిచిపెట్టాలని సైనికుడి తండ్రి విజ్ఞప్తి చేశాడు.