Solar scam defamation case verdict: కేరళ మాజీ ముఖ్యమంత్రుల పరువునష్టం కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సోలార్ కుంభకోణం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌పై మరో మాజీ సీఎం ఊమెన్ చాందీ వేసిన కేసులో.. కోర్టు చాందీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. చాందీకి రూ.10.10 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని అచ్యుతానందన్‌ను స్థానిక న్యాయస్థానం ఆదేశించింది.
Oomen chandy defamation case
2013లో చాందీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ స్కామ్ కేరళ రాజకీయాల్లో కలకలం రేపింది. సరితా నాయర్ అనే మహిళ తన భాగస్వామితో కలిసి.. పెద్ద ఎత్తున సోలార్ ప్యానెళ్లు విక్రయించాలని మోసానికి తెరతీశారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి సోలార్ ప్యానెళ్లు సరఫరా చేయకుండా చేతులెత్తేశారు.
Achuthanandan Chandy defamation case
చాందీ వద్ద పనిచేసే వ్యక్తుల్లో ముగ్గురికి.. సరితతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో చాందీ ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. అనంతరం ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురిని విధుల నుంచి తొలగించారు చాందీ.
ఈ కేసు గురించి గతంలో మీడియాతో మాట్లాడుతూ చాందీపై తీవ్ర ఆరోపణలు చేశారు అచ్యుతానందన్. ఈ వ్యవహారం జరిగినప్పుడు ఆయన రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్నారు. కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బును తరలించేందుకు చాందీ కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకూ వెనకాడలేదని ఆరోపించారు.
Chandy achutanandan solar scam
అచ్యుతానందన్ వ్యాఖ్యలను ఖండిస్తూ 2014లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు చాందీ. న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన తిరువనంతపురం సబ్‌కోర్టు.. అచ్యుతానందన్ తన ఆరోపణలకు సరైన ఆధారం సమర్పించలేకపోయారని పేర్కొంది. పరువు నష్టం జరిగినందుకు బదులుగా రూ.10.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నిజానికి చాందీ రూ.కోటి పరువు నష్టం దావా వేశారు. తర్వాత మనసు మార్చుకున్న ఆయన.. కోర్టు ఖర్చుల నిమిత్తం చెల్లిస్తే సరిపోతుందని న్యాయస్థానానికి తెలిపారు.
కోర్టు తీర్పుపై అచ్యుతానందన్ న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరువనంతపురం జిల్లా కోర్టులో దీనిపై అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.
రాజకీయాలను మార్చిన స్కామ్!!
అచ్యుతానందన్ వయసు 98. 2006 నుంచి 2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యం, కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం.. చాలా వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. గత వారమే ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వామపక్షాలకు నాయకత్వం వహిస్తూ 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాందీకి వ్యతిరేకంగా భారీగా ప్రచారాలు చేశారు అచ్యుతానందన్. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఘన విజయం సాధించాయి. అయితే, అచ్యుతానందన్‌ను పక్కనబెట్టిన సీపీఎం.. పినరయి విజయన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది.
అయితే, 2016 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వం వహించే యూడీఎఫ్‌లో ఎలాంటి పదవి చేపట్టలేదు చాందీ. శాసనసభ్యుడిగా మాత్రమే కొనసాగారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన సైతం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంటికి, పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఇతర కార్యక్రమాల్లో కనిపించడం లేదు. సోలార్ కుంభకోణంతో తనకు సంబంధం లేదని.. స్కామ్ బయటపడినప్పటి నుంచి చెబుతున్నారు చాందీ. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడనని స్పష్టం చేస్తూ వచ్చారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:నా భర్త నన్ను కొడతారు.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు: యూపీ మంత్రి