వీధి వ్యాపారుల వద్ద కూరగాయలు, లేదా పండ్లు కొనుగోలు చేస్తాం. కానీ వాటిని తీసుకువెళ్లి ఒక్కరోజు ఉంచామో లేదో మరుసటి రోజు కల్లా పాడైపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు కర్ణాటకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్(ఐఐహెచ్ఆర్) పరిశోధకులు ఓ సరికొత్త ఆవిష్కరణ చేశారు. సౌర శక్తితో పనిచేసే ఓ ట్రై సైకిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది అమ్మేవారికి, కొనేవారికి.. ఇద్దరికి ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ఆ ట్రై సైకిల్‌కు 'ఆర్కా' అని నామకరణం చేశారు.
లాభాలేంటి?
దుమ్ము, ధూళి నుంచి కూరగాయలను కాపాడేందుకు ఈ బండి చుట్టూ ఓ గ్లాస్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఇందులోని శీతలీకరణ వాతావరణం వల్ల 48 గంటల పాటు కూరగాయలు, పండ్లు తాజాగా ఉంటాయి. పంటకోత అనంతరం వాటిని బయటపెట్టడం వల్ల పాడైపోయి నష్టాలు ఎదురవుతుంటాయి. ఈ ట్రై సైకిల్ సాయంతో ఆ నష్టాలను అరికట్టవచ్చు.