"సౌర విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి చేసే మొదటి 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ అతిపెద్ద మార్కెట్. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భారత్‌కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. అతిపెద్ద ప్లాంట్ నిర్మాణంతో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది."
- ప్రధాని నరేంద్ర మోదీ
కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ పార్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి సౌరశక్తి ఉత్పాదనలో భారత్ చూపిస్తోన్న చొరవ అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో సౌర విద్యుత్ భవిష్యత్తు సహా మరిన్ని విషయాలపై ఈటీవీ భారత్.. పలువురు నిపుణులతో మాట్లాడింది.
అనంత శక్తి..
ఒక్కడే సూర్యుడు.. ప్రపంచానికి వెలుగిస్తాడు, పాడి పంటలకు జీవమిస్తాడు, పశుపక్ష్యాదులకు రక్షణగా నిలుస్తాడు, మనిషి మనుగడకు ప్రాణం పోస్తాడు. ఇప్పుడదే సూర్యుడు... వాహనాల్ని నడిపిస్తున్నాడు, పొలాలకు నీళ్లిస్తున్నాడు, వైద్యరంగాన్ని మలుపు తిప్పుతున్నాడు, మొత్తంగా మన అభివృద్ధినే శాసిస్తున్నాడు. అనంతమైన సౌరశక్తిని సరిగ్గా వాడుకుంటే, అంతమవుతున్న సహజ వనరుల గురించి చింతించాల్సిన అవసరం రాదు. ప్రస్తుతం భారత్ ఆ దిశగా వేగంగా అడుగులేస్తోంది.
అధునాతన సాంకేతికత, క్రియాశీల ప్రభుత్వ విధానాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం వల్ల సౌర విద్యుత్ పరిశ్రమ గత పదేళ్లలో విశేషంగా అభివృద్ధి చెందింది.
"2010లో యూపీఏ సర్కార్ ప్రారంభించిన జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ (జేఎన్‌ఎన్‌ఎస్ఎమ్).. సౌరశక్తి అభివృద్దికి పడిన తొలి అడుగుగా చెప్పొచ్చు. ఈ పథకం 2022 నాటికి 20 గిగావాట్ల (1 జీడబ్ల్యూ = 1,000 మెగావాట్లు) సౌర విద్యుత్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.