Solar Cycle: పెట్రోధరల మంటతో సతమతమవుతున్న వాహనదారులకు తమిళనాడు మధురైకి చెందిన ధనుష్ కుమార్ సరికొత్త మార్గం సూచించారు. సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ తయారుచేశాడు. ఈ సైకిల్‌ను తయారు చేయడానికి ధనుష్ కుమార్ సైకిల్ క్యారియర్‌పై బ్యాటరీని అమర్చాడు. దాని ముందు భాగంలో సోలార్ ప్యానెల్ అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఈ సైకిల్‌తో ఆగకుండా 50 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. విశేషమేమిటంటే ఛార్జింగ్ తగ్గినా 20 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ప్రభుత్వం నుంచి తన సోదరి పొందిన సైకిల్‌నే ఎలిక్ట్రిక్ సైకిల్‌గా మార్చినట్లు ధనుష్ తెలిపాడు.
పెట్రోలుతో పోలిస్తే ఈ బ్యాటరీ వినియోగించే విద్యుత్ ఖరీదు చాలా తక్కువని ధనుష్ అంటున్నారు. దీంతో కేవలం రూపాయిన్నర ఖర్చుతో 50 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఈ సైకిల్ 30 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్తోంది. దీని వేగం ద్విచక్రం వాహనంతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి సరిపోతుందని తెలిపారు. వేగాన్ని అదుపు చేయడానికి సైకిల్‌కు ఆక్సిలరేటర్, పెండల్స్‌ను సైతం అమర్చారు.