Social Media Crimes: ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదని తమిళనాడు పోలీసులను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ యూట్యూబర్‌పై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రశ్నను లేవనెత్తింది.
అసత్యాలతో వీడియోలు రూపొందిస్తున్నాడంటూ దురైమురుగన్ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడికి బెయిల్ మంజురైంది. అయితే, నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఏ మాత్రం అనుమతించబోమని, నిందితుడు దురైమురుగన్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించాడో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.