శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి ఎంతో పురోగతి సాధిస్తున్నా.. దేశంలో ఏదో ఒక మూలన సాంఘిక దురాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే కర్ణాటక మైసూర్ జిల్లాలోని మూగురు గ్రామంలో జరిగింది. తమ భూమిలో అక్రమంగా భవనం నిర్మించటమేంటని ప్రశ్నించిన 12 కుటుంబాలను ఊరి నుంచి వెలివేశారు(social exclusion) పెద్దలు. అందులో గ్రామ పంచాయతీ సభ్యుడి కుటుంబం సైతం ఉండటం గమనార్హం.
గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలు "సంఘ బహిష్కరణకు గురైన కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదు(social boycott). ఇంట్లో శుభకార్యాలకు, పండుగలకు వారిని ఆహ్వానించటానికి వీలు లేదు. వారికి ఎలాంటి సాయం చేయకూడదు" అని కట్టుబాటు పెట్టారు పెద్దలు.
రాళ్ల దాడి..
వివాహానికి హాజరయ్యారనే కారణంగా బహిష్కరణకు గురైన ఓ కుటుంబానికి(social boycott) ఇటీవల రూ.25వేల జరిమానా విధించారు గ్రామ పెద్దలు. ఈ విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు చెప్పుకున్నారు బాధిత కుటుంబాల సభ్యులు. 'ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. పై అధికారులకు సైతం తెలియజేశాం. కానీ ఏ ఒక్కరూ స్పందించటం లేదు. మాకు న్యాయం కావాలి. సంఘ బహిష్కరణ నుంచి విముక్తి కల్పించాలి. ' అని పేర్కొన్నారు. మీడియా ముందుకు వచ్చిన వారిపై గ్రామస్థులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. రాఘవేంద్ర, బసవరాజు, నాగేంద్ర, మూర్తి, శంకర్ సహా వారితో ఉన్నవారిపైనా దాడి జరిగిందని, వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:సీన్ రివర్స్.. ఆ 'సూపర్ హీరో'ను చుట్టుముట్టిన వివాదాలు