జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి, మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఫలితంగా దాదాపు 4,500 పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 'హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్ రహదారిని మూసివేశాం. ప్రధానంగా జవహర్ సొరంగ మార్గం ద్వారా రాకపోకలు పూర్తిగా నిలిపివేశాం.' అని ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 260 కిలోమీటర్ల రహదారి పొడవునా ఎక్కడికక్కడ మంచు తొలగించి రాకపోకలకు మార్గాన్ని సుగమం చేస్తున్నామన్నారు. మరోవైపు జమ్ము నగరాన్ని కశ్మీర్‌లోయను కలుపుతూ నిర్మించిన మొఘల్ రోడ్డును గత వారం రోజులుగా అధికారులు మూసివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అత్యధిక హిమపాతం నమోదైనట్లు వెల్లడించారు. రహదారులపై రెండుమూడు అడుగులమేర మంచుపేరుకుపోయినట్లు చెప్పారు.