Smriti Irani Parliament Speech Today :మణిపుర్లో భరతమాత హత్యకు గురైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి మాటలు మాట్లాడారని విమర్శించారు. భరత మాతను హత్య చేశారని రాహుల్ అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడిన అనంతరం ఆమె ప్రసంగించారు. మణిపుర్ ఎప్పటికీ మన దేశంలో భాగమేనని.. దీనిని ఎవరూ విడదీయలేరని తేల్చి చెప్పారు.
"దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయే. మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలో చాలా జరిగాయి. రాజస్థాన్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. ముక్కలుగా నరికేశారు. గిరిజా టిక్కు, సరళా భట్ వంటి ఘటనలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు వల్లనే రాహుల్ పాదయాత్ర చేయగలిగారు. ఆర్టికల్ 370 మళ్లీ తెస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కశ్మీర్ పండితులకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా? కశ్మీర్ మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా? మీరు ఇండియానే కాదు. మీ కూటమిలోని తమిళనాడుకు చెందిన ఓ నేత ఇండియా అంటే కేవలం ఉత్తరభారతం మాత్రమేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై రాహుల్ ఎందుకు స్పందించరు? ఒకప్పుడు కశ్మీర్ లోయలో రక్తం ఏరులై పారేది. కానీ మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మీరు వెళ్లి హాయిగా మంచు గడ్డలతో ఆడుకోగలిగారు. మీరు ఇండియా కాదు. మీరు అవినీతి, కుటుంబ పాలనుకు ప్రతీకలు. ఇప్పుడు ప్రజలంతా అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా అని నినదిస్తున్నారు. "
--స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి