Smriti Irani On Marital Rape: దేశంలోని మహిళలు, చిన్నారులను సంరక్షించడం మన ప్రాథమిక కర్తవ్యం అని అన్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. అలా అని ప్రతి వివాహం హింసాత్మకం అని ఖండించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్ అని అనడం ఆమోదయోగ్యం కాదని రాజ్యసభలో స్పష్టం చేశారు.
'వైవాహిక అత్యాచారం'అనే విషయంపై సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వమ్ సభలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు స్మృతి ఇరానీ. గృహ హింస నిర్వచనాన్ని గృహహింస చట్టంలోని సెక్షన్ 3 నుంచి తీసుకుందా? అత్యాచారం నిర్వచనాన్ని ఐపీసీ సెక్షన్ 375 నుంచి తీసుకుందా? లేదా? అని ప్రశ్నలు సంధించారు ఎంపీ బినోయ్ విశ్వమ్.
రూల్ 47 ప్రకారం ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశాలపై సభలో చర్చించొద్దని సీనియర్ నేతకు తెలుసని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. దేశంలోని మహిళల భద్రతకు రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. 'ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. 66లక్షల మంది మహిళలకు సాయపడ్డాయి. అంతేకాక దేశవ్యాప్తంగా 703 వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు 5లక్షల మంది మహిళలు సేవలు అందించాయి.' అని వివరించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
వివాహ వ్యవస్థకు అర్థం లేదు..
ఒకవేళ భార్యపై బలవంతపు శృంగారాన్ని నేరంగా భావించాలని కేంద్రం భావిస్తే.. వివాహ వ్యవస్థ అన్న పదానికి అర్థం లేదన్నారు భాజపా నేత సుశీల్ మోదీ.