Air India Express Emergency Landing : కాలుతున్న వాసన రావడం వల్ల 175 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం.. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వెంటనే అధికారులు, ఇంజినీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేసి.. పొగ లేదా ఇతర సాంకేతిక సమస్యలు లేవని తెలిపింది. ప్రయాణికులు బయలుదేరేందుకు గురువారం ఉదయం మరొక విమానం ఎర్పాటు చేసింది ఎయిర్ ఇండియా.
ఇదీ జరిగింది.. బుధవారం రాత్రి కేరళలోని కొచ్చి నుంచి షార్జాకు 175 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో కాలుతున్న దుర్వాసన వస్తున్నట్లు ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది ప్రయాణికులు కూడా అలాగే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా.. విమానాన్ని మళ్లీ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే, ఆ సమయంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొందని.. కానీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అందులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్ తెలిపారు.