Slight illness to CM KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆస్పత్రిలో గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు చేసినట్లు ఏఐజీ ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగాధిపతి డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎండోస్కోపి, పొత్తి కడుపుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించామన్నారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు గుర్తించామన్నారు.
దాదాపు ఏడు గంటలపాటు ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ అనంతరం తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గవర్నర్.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు అల్సర్... ఏఐజీ ఆస్పత్రి వైద్యపరీక్షల్లో వెల్లడి
'సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వచ్చారు. సీఎంకు ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేశాం. కేసీఆర్ కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించాం.'-ఏఐజీ ఆస్పత్రి వైద్యులు
ఏఐజీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెంట సతీమణి శోభ, కూతురు కవిత, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, విప్ కౌశిక్ రెడ్డి, తదితరులు వెళ్లారు. అంతకుముందే దిల్లీ నుంచి వచ్చిన కవిత తండ్రిని కలవడానికి ప్రగతిభవన్ వెళ్లారు. నిన్న జరిగిన ఈడీ విచారణపై సీఎం, ఇతర నేతలతో చర్చించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో ఆయన వెంట ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏఐజీ ఆస్పత్రి పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్‌కు అల్సర్... ఏఐజీ ఆస్పత్రి వైద్యపరీక్షల్లో వెల్లడి
గతంలోను ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఎడమచేయి నొప్పిగా ఉండటంతో గత సంవత్సరం ఇదే రోజుల్లో వైద్యుల సూచన మేరకు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వివిధ రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రామ్, ఈసీజీ, 2డి ఎకో, మెదడు, వెన్నెముకలకు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చాక గుండె ఆరోగ్యం, మూత్రపిండాలు, కాలేయం పనితీరులో ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. కాకపోతే వెన్నముకలో కొంచెం సమస్య ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు. సీఎం ఎక్కువగా చదవడం, ఐప్యాడ్ చూస్తుండడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో ఎడమ చేయి నొప్పి వస్తుందని పేర్కొన్నారు. అప్పుడు కూడా వేసవిలోనే అనారోగ్య సమస్య తలెత్తడంతో వయసు రీత్యా ఇవి సాధారణమే అని సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహిస్తున్నారు.
ఇవీ చదవండి: