Skeleton bag in Bengal: బంగాల్ సిలిగుడి ప్రాంతం నక్సల్బరీ మార్కెట్లో అస్థిపంజరాలతో కూడిన బ్యాగ్ దొరకడం స్థానికంగా కలవరం రేపింది. చౌరింగ్గీ మార్కెట్ ప్రాంతంలోని బంగారు నగల దుకాణం వెనుక ఉన్న చెత్త కుప్ప సమీపంలో స్థానిక నివాసి మలవిసర్జనకు వెళ్లగా.. అక్కడ ఒక బ్యాగ్ నిండా అస్థిపంజరాలు ఉండడాన్ని గమనించాడు. ఆ విషయాన్ని స్థానిక వ్యాపారులకు చెప్పాడు. దీంతో విషయం చుట్టుపక్కల ప్రజలకు వ్యాపించింది. అస్థిపంజరాల సంచిని చూసి స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, ఈ సమాచారాన్ని దగ్గరో ఉన్న నక్సల్బరీ పోలీస్టేషన్‌కు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరాలను పరీక్షల నిమిత్తం ఉత్తర బంగాల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డార్జీలింగ్ డీఎస్పీ అచింత్య గుప్తా మాట్లాడుతూ.. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపడతామన్నారు.
ఆ సంచిలో పుర్రె, వెన్నెముకలు, కాళ్లుచేతుల ఎముకలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుడు బిశ్వజిత్ మండల్ మాట్లాడుతూ.. అ అస్థిపంజరాలపై ఇంగ్లిష్ అక్షరాలతో పేర్లు రాసి ఉన్నాయన్నారు. మార్కెట్ మధ్యలో ఈ అస్థిపంజరాల సంచి బయటపడడం వల్ల స్థానిక వ్యాపారస్థులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.